Delhi: ప్రముఖ ఆసుపత్రిపై పోలీస్ కేసు నమోదు.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేజ్రీవాల్!
- ఢిల్లీలో బెడ్ల బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్న ఆసుపత్రులు
- ప్రఖ్యాత సర్ గంగారామ్ ఆసుపత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు
- తప్పుడు పనులకు పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదన్న కేజ్రీవాల్
కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించిన ఓ ప్రైవేటు ఆసుప్రతిపై ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. కరోనా పేషెంట్ల పట్ల ఢిల్లీ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత సర్ గంగారామ్ ఆసుపత్రిపై చర్యలు తీసుకుంది. వైద్య శాఖ డిప్యూటీ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగారామ్ ఆసుపత్రిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కరోనా కేసుల కోసం ఆర్టీ-పీసీఆర్ అనే యాప్ ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ది చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోగి టెస్టు వివరాలను ఇందులో కచ్చితంగా రిజిస్టర్ చేయాలి. దీని వల్ల దేశ వ్యాప్తంగా కరోనాకు సంబంధించిన డేటా రియల్ టైమ్ లో కేంద్ర ప్రభుత్వ డేటాబేస్ లో అందుబాటులో ఉంటుంది. అయితే గంగారామ్ ఆసుపత్రి ఈ నిబంధనను ఖాతరు చేయలేదు. టెస్టులను రిజిస్టర్ చేయడం లేదు. దీంతో ఈ ఆసుపత్రిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
మరోవైపు నగరంలోని ఆసుపత్రుల నిర్వహణను ఢిల్లీ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కరోనా పేషెంట్లను చేర్చుకోవడం లేదనే ఫిర్యాదులు ఎక్కువవుతుండటంతో రంగంలోకి దిగింది. దీంతో, ఆసుపత్రుల నిర్వాకాలు బయటపడుతున్నాయి.
ఈరోజు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీలో కరోనా పేషెంట్లకు బెడ్ల కొరత లేదని చెప్పారు. కరోనా లక్షణాలతో వచ్చిన వారిని వెనక్కి పంపించడం లేదని తెలిపారు. అయితే కొన్ని ఆసుపత్రులు మాత్రం తప్పుడు చర్యలకు పాల్పడుతున్నాయని... అలాంటి వాటిని క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
'కరోనా పేషెంట్లను చేర్చుకోవడానికి కొన్ని ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. కొన్ని పార్టీల అండదండలున్న ఆసుపత్రులు... బెడ్ ల బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్నాయి. బెడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ... బ్లాక్ మార్కెటింగ్ కోసం వాటిని ఉపయోగిస్తున్నాయి. బెడ్ ల బ్లాక్ మార్కెటింగ్ లో కొందరు మునిగిపోయారు. అలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నా' అని కేజ్రీవాల్ చెప్పారు.
మరోవైపు, ఢిల్లీలో కరోనా ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 26 వేల మార్కును అధిగమించింది. 700కు పైగా మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఆసుపత్రుల నిర్వాకం విమర్శల పాలవుతోంది. కరోనా సంక్షోభ సమయంలో కక్కుర్తి పనులేంటని జనాలు మండిపడుతున్నారు.