Police: జార్జి ఫ్లాయిడ్ ఉదంతాన్ని గుర్తుకుతెచ్చిన రాజస్థాన్ పోలీసులు... చివర్లో పోలీసులనే కొట్టిన బాధితుడు!

Rajasthan Police replicates George Floyd incident

  • ఫ్లాయిడ్ మెడపై కాలితో నొక్కిపెట్టిన కారణంగా మరణం
  • రాజస్థాన్ లోనూ అలాంటిదే సంఘటన
  • కానీ పోలీసుపై తిరగబడిన పౌరుడు

అమెరికాలోని మినియాపోలిస్ లో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం అందరికీ తెలిసిందే. ఫ్లాయిడ్ ను అదుపులోకి తీసుకునేందుకు ఓ పోలీస్ అధికారి అతని మెడపై కాలితో నొక్కిపెట్టి అతడి మరణానికి కారణమయ్యాడు. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇప్పుడలాంటి ఘటనే రాజస్థాన్ లో జరిగింది.

జోథ్ పూర్ లో ముఖేశ్ కుమార్ ప్రజాపత్ అనే వ్యక్తి మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశంలోకి వచ్చాడు. మాస్కు లేకుండా బయటికి రావడం నిబంధనలకు విరుద్ధమని అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లు హెచ్చరించారు. అయితే అతడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసు కానిస్టేబుల్ కు చెందిన మొబైల్ ఫోన్ లాక్కుని దాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడ్ని కిందపడేసిన ఓ పోలీస్ కానిస్టేబుల్ అచ్చం జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తరహాలో మెడపై మోకాలితో నొక్కిపెట్టాడు. ఆపై మొబైల్ ఫోన్ లాగేసుకున్నాడు.

అయితే, పైకిలేచిన ప్రజాపత్ మరో కానిస్టేబుల్ పై తన ప్రతాపం చూపించాడు. ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. తాను కొడుతున్నది ఓ విధి నిర్వహణలో ఉన్న పోలీసుననే స్పృహ లేకుండా విచక్షణ రహితంగా కొడుతూనే ఉన్నాడు. ఇంతలో పోలీస్ జీప్ రావడంతో పాపం ఆ కానిస్టేబుల్ కు మరిన్ని దెబ్బలు తప్పాయి. పబ్లిక్ ప్లేసులో వీరంగం వేసిన ప్రజాపత్ ను విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశాడంటూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News