Corona Virus: 20 నిమిషాలు, రూ. 550... కరోనా టెస్టింగ్ కిట్ ను కనిపెట్టిన హైదరాబాద్ ఐఐటీ!
- ఆర్టీ-పీసీఆర్ కు ప్రత్యామ్నాయ విధానం
- భారీ ఎత్తున తయారు చేస్తే కిట్ రూ. 350కే
- వెల్లడించిన ఐఐటీ ప్రొఫెసర్ శివ్ గోవింద్
తక్కువ ఖర్చుతో శరీరంలో కరోనా వైరస్ ఉందా? లేదా? అన్న విషయాన్ని కనిపెట్టేందుకు హైదరాబాద్ ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఓ సరికొత్త టెస్టింగ్ కిట్ ను అభివృద్ధి చేసింది. దీన్ని వాడితే కేవలం 20 నిమిషాల్లోనే ఫలితం తెలిసిపోతుంది. ఆర్టీ-పీసీఆర్ (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలీమెర్స్ చైన్ రియాక్షన్)కు ప్రత్యామ్నాయ విధానమని ఐఐటీ రీసెర్చర్లు వెల్లడించారు.
ఇక ఈ కిట్ ఖరీదు కూడా చాలా తక్కువగా ఉండనుంది. కేవలం రూ. 550కే దీన్ని తయారు చేశామని, భారీ ఎత్తున కిట్లను తయారు చేస్తే, రూ. 350కే అందించవచ్చని రీసెర్చర్లు వెల్లడించారు. టెస్టింగ్ కిట్లకు సంబంధించిన పరీక్షలకు ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో పరీక్షించామని, పరీక్షల్లో విజయవంతం అయిన తరువాత ఐసీఎంఆర్ అనుమతుల కోసం వేచి చూస్తున్నామని ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ తెలియజేశారు.
"ఈ టెస్టింగ్ కిట్ చాలా సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఏ సమయంలోనైనా వినియోగించవచ్చు. ఇది ప్రస్తుతమున్న పరీక్షా విధానాలకు ప్రత్యామ్నాయం. కొవిడ్-19 జీనోమ్ ను ఇది సులువుగా కనుగొంటుంది" అని శివ్ గోవింద్ సింగ్ వ్యాఖ్యానించారు. కాగా, కరోనా వైరస్ కు టెస్టింగ్ కిట్ ను అభివృద్ధి చేసిన రెండో భారత ఐఐటీ హైదరాబాద్ కు చెందినది కావడం గమనార్హం.