Corona Virus: మహమ్మారితో చెలగాటాలా?... స్కూళ్లు తెరవవద్దంటూ తెలంగాణ తల్లిదండ్రుల పిటిషన్!

Telangana Parents Petition that No Schools Upto Zero Corona Cases

  • ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న పిటిషన్
  • ఇప్పటికే ఐదున్నర లక్షల మందికి పైగా సంతకాలు
  • పిల్లల భద్రతపై దృష్టి సారించాలని వినతి
  • ఈ-లెర్నింగ్ ను ప్రోత్సహించాలని డిమాండ్

సాధారణంగా స్కూళ్లకు వెళ్లబోమంటూ పిల్లలు మారాం చేస్తుంటారు. వారిని పాఠశాలలకు పంపేందుకు ప్రతి నిత్యమూ తల్లిదండ్రులు నానా తంటాలూ పడుతూ ఉంటారు. అయితే, ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ, తమ పిల్లలను స్కూళ్లకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి. జూలై 1 నుంచి దశలవారీగా పాఠశాలలను తెరిపించాలని ప్రభుత్వం నిశ్చయించిన వేళ, రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గేంతవరకూ లేదా వాక్సిన్ వచ్చే వరకూ స్కూళ్లు వద్దని  ‘పేరెంట్స్ అసోసియేషన్’ అనే బృందం ఓ ఆన్ లైన్ పిటిషన్ పోస్ట్ చేసింది.
 
ఈ పిటిషన్ ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను ఉద్దేశించి పోస్ట్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల విషయంలో వెనక్కు తగ్గేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నిప్పుతో చెలగాటం వద్దంటూ సాగే పిటిషన్ పై ఇప్పటికే ఐదున్నర లక్షల మందికి పైగా తల్లిదండ్రులు సంతకాలు చేశారు. జూలైలో స్కూళ్లను ఓపెన్ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ మాత్రమూ సరికాదని అంటున్నారు.

పిల్లల భద్రతకు హామీ ఎవరిస్తారని అడుగుతున్న తల్లిదండ్రులు, ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని ఈ-లెర్నింగ్ విధానంలో కొనసాగించాలని, వర్చువల్ లెర్నింగ్ ను ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తున్నారు. భౌతిక దూరం, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని స్కూళ్ల యాజమాన్యాలు చెబుతున్నా, అవి కరోనా నుంచి తమ బిడ్డలను కాపడలేవన్నది అత్యధికుల అభిప్రాయం.

ఇదిలావుండగా, కొందరు తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు మాత్రం కేసులు 'సున్నా' స్థాయికి తగ్గేంత వరకూ పాఠశాలలు వద్దనడం మంచి సలహా కాదని, ఇప్పటికిప్పుడు కాకున్నా, ఓ రెండు మూడు నెలల తరువాతైనా స్కూళ్లు తెరచాలని అంటున్నారు.

ఈ విషయంలో బాలల హక్కుల సంఘం కూడా హైకోర్టును ఆశ్రయించింది. "మానవ చరిత్రలో అత్యంత అరుదైన మహమ్మారి ఇప్పుడు పట్టుకుంది. ఈ వైరస్ పిల్లలపై పెను ప్రభావాన్ని చూపిస్తుందని వైద్య వర్గాలు స్పష్టం చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో జూలైలో పాఠశాలలు తెరిస్తే, క్లాస్ రూములో పిల్లలు భౌతిక దూరాన్ని ఎలా పాటిస్తారు? తగు జాగ్రత్తలను వారే ఎలా తీసుకుంటారు. ఏ తల్లిదండ్రులు కూడా తమ చిన్నారులను బయటకు పంపేందుకు ఇష్టపడటం లేదు. వారి ప్రాణాలకు ముప్పున్న ఈ విపత్కర పరిస్థితుల్లో స్కూళ్లు వద్దు" అంటూ పిటిషన్ దాఖలు చేసింది. పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహించరాదని తాము వేసిన పిటిషన్ పై విచారణ అనంతరమే పరీక్షలు వాయిదా పడ్డాయని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత రావు తెలిపారు.

  • Loading...

More Telugu News