Madhya Pradesh: ఆసుపత్రిలో దారుణం.. బిల్లు చెల్లించలేదని రోగిని బెడ్‌పై తాళ్లతో కట్టేసిన వైనం
- మధ్యప్రదేశ్‌లో ఘటన
- ఆసుపత్రిపై చర్యలకు సీఎం ఆదేశం
- చివరకు బిల్లు మాఫీ చేసిన ఆసుపత్రి
- కొనసాగుతోన్న విచారణ
మధ్యప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్యం చేయించుకుని బిల్లు కట్టలేదని ఓ వృద్ధుడిని ఆసుపత్రి బెడ్‌పైనే తాళ్లతో కట్టేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు రావడంతో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించి, ఆ ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే... అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ వృద్ధుడిని అతడి కుటుంబ సభ్యులు ఇటీవల షజాపూర్లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య చికిత్సకు గానూ రూ.11,000 బిల్లు వేశారు. అతడిని ఆసుపత్రిలో చేర్పించే సమయంలో అడ్వాన్సుగా రూ.5,000 కూడా తీసుకున్నారు.
అతడికి మరికొన్ని రోజులు చికిత్స చేయాల్సి ఉంది. అయితే, తమ వద్ద డబ్బు లేదని ఆ వృద్ధుడి కుమార్తె వైద్యులతో చెప్పారు. దీంతో డబ్బు మొత్తం చెల్లించి తీసుకెళ్లాలని ఆయనను కట్టేశారు. ఈ ఘటన సంచలనం రేపడంతో ఆసుపత్రి సిబ్బంది మరోలా మాట్లాడారు.
ఆ వృద్ధుడు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడని, తనకు తాను ఏమీ చేసుకోకుండా ఉండేందుకే ఇలా కట్టివేశామని చెప్పారు. ఆ వృద్ధుడు బిల్లు కట్టే అవసరం లేదని చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.