Karne Prabhakar: ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్లానన్న బాధ రేవంత్ రెడ్డిలో ఉండొచ్చు: కర్నె ప్రభాకర్
- జన్ వాడలో కేటీఆర్ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న రేవంత్
- రేవంత్ ఆరోపణలపై మండిపడుతున్న టీఆర్ఎస్ నేతలు
- కాంగ్రెస్ నేతలే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మండిపాటు
జన్ వాడలో మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫాంహౌస్ నిర్మిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి తీవ్ర పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విచారణ కమిటీ విధించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, కర్నె ప్రభాకర్ తదితరులు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాల్క సుమన్ మాట్లాడుతూ, ఆ ఫాంహౌస్ కేటీఆర్ దేనంటూ రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని, కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఆరోపణలను ఖండిస్తున్నామని అన్నారు. రేవంత్ రెడ్డి తీరు దొంగే దొంగా దొంగా అన్నట్టుగా ఉందని విమర్శించారు.
ఎదుటివాళ్లపై బురదచల్లడమే రేవంత్ పని అని వ్యాఖ్యానించారు. వట్టినాగులపల్లిలో రేవంత్, ఆయన బావమరిది చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలకే ఫాంహౌస్ లు ఉన్నాయని తెలిపారు. రేపటి నుంచి రేవంత్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయని అన్నారు.
అటు, కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం నుంచి రేవంత్ తీరు చూస్తే అందరూ ఒకవైపు ఉంటే రేవంత్ తన బృందంతో మరోవైపు ఉంటున్నట్టు తెలుస్తోందని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి జైలుకు వెళ్లానన్న బాధ రేవంత్ రెడ్డికి ఉండొచ్చని, అది ఆయన చేజేతులా చేసుకున్నదేనని, అందుకు ఎవరూ కారణం కాదని కర్నె పేర్కొన్నారు. మళ్లీ డ్రోన్ కేసులో జైలుకు వెళ్లి, ఆ కోపం అంతా వ్యక్తిగత కక్షల రూపంలో తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఆ ఫాంహౌస్ తనది కాదని కేటీఆర్ ఎంతో స్పష్టంగా చెబుతున్నా, రేవంత్ అదేపనిగా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.