Shiv Sena: కరోనా వేళ 'కొత్త మహాత్ముడు' ఊడిపడ్డాడు... సోనూ సూద్ పై శివసేన అక్కసు!
- లాక్ డౌన్ తో కష్టాల్లో చిక్కుకున్న వలసజీవులు
- బస్సులు ఏర్పాటు చేసి స్వస్థలాలకు తరలించిన సోనూ సూద్
- ఆ కార్మికులు ఎక్కడికి వెళ్లారో చెప్పాలన్న శివసేన నేత రౌత్
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన వలస కార్మికుల పాలిట నటుడు సోనూ సూద్ ఆపద్బాంధవుడే అయ్యాడు. మానవత్వానికి సిసలైన ప్రతిరూపంలా నిలుస్తూ, తన సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి వలసజీవులను వారి స్వస్థలాలకు చేర్చాడు. తన పెద్ద మనసుతో అందరి ప్రశంసలకు పాత్రుడయ్యాడు. కానీ, శివసేన మాత్రం సోనూ సూద్ పై అక్కసు వెళ్లగక్కుతోంది.
కరోనా వేళ 'కొత్త మహాత్ముడు' ఊడిపడ్డాడని వ్యంగ్యం ప్రదర్శించింది. సోనూ సూద్ త్వరలోనే ప్రధానిని కలుస్తాడని, ముంబయి మహానగరానికి 'సెలబ్రిటీ మేనేజర్' అయిపోతాడని ఎద్దేవా చేసింది. పార్టీ అధికారిక పత్రిక 'సామ్నా'లో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో సోనూ సూద్ అన్ని బస్సులను ఎలా తీసుకువచ్చారని రౌత్ ప్రశ్నించారు. కఠిన నిబంధనలు అమల్లో ఉండడంతో, వలస కార్మికులను అనేక రాష్ట్రాల్లోకి అనుమతించలేదని, మరి సోనూ సోద్ తరలించిన కార్మికులు ఎక్కడికి వెళ్లారో చెప్పాలని అన్నారు.