High Power Committee: గ్యాస్ లీక్ ప్రమాదంపై హైపవర్ కమిటీ విచారణ... హాజరైన ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులు
- వరుసగా రెండోరోజు విచారణ
- తమ గ్రామం పూర్తిగా దెబ్బతిందన్న వెంకటాపురం వాసులు
- తమకే ఎక్కువ పరిహారం ఇవ్వాలని వినతి
- కంపెనీ లైసెన్సులు రద్దు చేయాలన్న రాజకీయ నేతలు
విశాఖలో తీవ్ర కలకలం రేపిన గ్యాస్ లీక్ ఘటనపై హైపవర్ కమిటీ వరుసగా రెండో రోజు విచారణ జరిపింది. ఈ విచారణలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులు, పరిసర గ్రామాల ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. బాధిత గ్రామాల ప్రజలు, వివిధ పార్టీల నేతలు కమిటీకి తమ అభిప్రాయాలు తెలియజేశారు. గ్యాస్ లీక్ ఘటనతో తమ గ్రామం పూర్తిగా దెబ్బతిందని వెంకటాపురం గ్రామస్తులు వెల్లడించారు. ఎక్కువ నష్టపరిహారం తమ గ్రామానికే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మిగతా గ్రామాల ప్రజలు స్పందిస్తూ, తమకు శాశ్వత ప్రాదికన హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా, ఆయా గ్రామాల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఉద్యోగాలు కోల్పోయిన 500 మందికి ఉపాధి కల్పించాలంటూ కమిటీకి వినతిపత్రాలు సమర్పించారు. రాజకీయ పార్టీల నేతలు స్పందిస్తూ, పరిశ్రమ ఉన్నచోట తరచూ మాక్ డ్రిల్ నిర్వహించకపోవడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి ఓ కారణమని విమర్శించారు. లైసెన్సులు రద్దు చేసి కంపెనీని తరలించాలని రాజకీయనేతలు కోరారు.