Unlock: నేటి నుంచి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు!
- ప్రారంభమైన అన్ లాక్ 1.0
- థియేటర్లు, బార్లకు మాత్రం లభించని అనుమతి
- పూర్తి స్థాయిలో సాగనున్న కమర్షియల్ ఆపరేషన్స్
ఇండియాలో అన్ లాక్ 1.0 ప్రారంభమైంది. సుమారు 80 రోజుల పాటు మూతబడిన భారతావనిలో, ఇప్పటికే పలు రంగాల్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కాగా, నేటి నుంచి కీలకమైన రెస్టారెంట్లు, హోటళ్లు, దేవాలయాలు, మాల్స్ తెరచుకోనున్నాయి. దీంతో దాదాపు అన్నీ తెరచుకున్నట్టే. ఇదే సమయంలో జనసాంద్రత అధికంగా ఉండే థియేటర్లు, బార్లు, బహిరంగ సభలు, సామూహిక ప్రార్థనలు, కళా ప్రదర్శనలకు మాత్రం ఇంకా అనుమతి లభించలేదు.
ఇక ఈ ఉదయం తమతమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించాలన్న ఉద్దేశంతో గత వారం రోజుల నుంచే స్టార్ హోటళ్లు, లాడ్జిలు, రెస్టారెంట్లు, మాల్స్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తగు ఏర్పాట్లు చేసుకున్నాయి. మెయిన్ గేట్ల వద్దే శానిటైజేషన్, ధర్మల్ స్క్రీనింగ్ ను ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. దీంతో నేటి నుంచి దాదాపు పూర్తి స్థాయిలో కమర్షియల్ లావాదేవీలన్నీ మొదలవుతున్నట్టే!