TTD: ఎస్సెమ్మెస్ పంపితే చాలు... తిరుపతి పరిసరాల దేవాలయాల దర్శనం టికెట్ ఫ్రీ... టీటీడీ నిర్ణయం
- రెండున్నర నెలలకు పైగా కొనసాగుతున్న లాక్ డౌన్
- నేటి నుంచి ఆలయాల్లో దర్శనాలు
- స్థానిక ఆలయాల సందర్శన కోసం టీటీడీ వినూత్న పథకం
రెండున్నర నెలలకు పైగా దేశ ప్రజలు లాక్ డౌన్ ఆంక్షలతో మగ్గిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, ఆలయాలు వంటివి తెరుచుకోవడం కాస్త ఊరట కలిగించే విషయం. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినవారు తిరుపతి, ఆ పరిసరాల్లో ఉన్న స్థానిక ఆలయాలను కూడా సందర్శించడం ఆనవాయితీ. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఓ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.
ఈ ఆలయాలను దర్శించుకోవాలనుకునేవారికి ఆన్ లైన్ లో తన అధికారిక వెబ్ సైట్ (https://tirupatibalaji.ap.gov.in) ద్వారా ఉచితంగా టికెట్లు జారీచేస్తోంది. ఈ దర్శన టికెట్లను ఆలయాల వద్ద మిషన్లలోనూ తీసుకోవచ్చు. లేకపోతే, మొబైల్ ఫోన్ నుంచి 93210 33330 అనే నెంబరుకు భక్తులు దర్శించాలనుకుంటున్న ఆలయం కోడ్ తో సహా పూర్తి వివరాలు ఎస్సెమ్మెస్ చేస్తే ఫ్రీ టికెట్ పంపిస్తారు. అందుకోసం ఆలయాల కోడ్ లను కూడా వెల్లడించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం-SVP, శ్రీనివాసం మంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం-SVS, అప్పలయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం-SVA, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం-SVG, తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం-SVK.