Arvind Kejriwal: కేజ్రీవాల్ కు షాకిచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్!
- ఢిల్లీ వాసులకు మాత్రమే కరోనా చికిత్స అన్న కేజ్రీవాల్
- వైద్య చికిత్సలో వివక్ష ఉండరాదన్న అనిల్ బైజాల్
- ప్రతి ఒక్కరికీ సేవలందించాలని ఆదేశం
ఢిల్లీలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో.. పేషెంట్లకు ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే చికిత్స అందిస్తామని ఆయన నిన్న ప్రకటించారు. ఈ ప్రకటన కలకలం రేపింది. ఈ నిర్ణయంపై బీజేపీ సహా పలు పార్టీలు మండిపడ్డాయి.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ షాకిచ్చారు. కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తిరస్కరించారు. ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరినీ సమానంగా చూస్తామని ఈ సందర్భంగా బైజాల్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానికేతరుడు అనే కారణంతో ఏ ఒక్కరు కూడా వైద్య చికిత్సకు దూరం కాకూడదని ఆయన అన్నారు. ఇదే సమయంలో... కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే టెస్టులు చేయాలనే కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని సైతం బైజాల్ బుట్టదాఖలు చేశారు. లక్షణాలు కనిపించని (అసింప్టొమాటిక్), హైరిస్క్ కాంటాక్ట్ ఉన్నవారికి కూడా పరీక్షలు నిర్వహించాల్సిందేనని చెప్పారు.
ఈ సందర్భంగా... పలు సందర్భాలలో సుప్రీంకోర్టు ఉటంకించిన 'ఆరోగ్య హక్కు'ను లెఫ్టినెంట్ గవర్నర్ ప్రస్తావించారు. ఆరోగ్య హక్కు అనేది రాజ్యాంగంలోని జీవించే హక్కులో ఒక భాగమని అన్నారు. స్థానికులు, స్థానికేతరులు అనే తారతమ్యం లేకుండా ఢిల్లీలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రి సేవలను అందించాలని ఆదేశించారు.