China: సరిహద్దుల్లో పరిస్థితులు చక్కబడ్డాయి... ఇప్పుడు ఉద్రిక్తతలు లేవు: చైనా
- జూన్ 6న సైనికాధికారుల సమావేశం జరిగిందన్న చైనా విదేశాంగ ప్రతినిధి
- సరిహద్దుల వద్ద ప్రస్తుతం ప్రశాంతత నెలకొందని వెల్లడి
- సరిహద్దుల్లో శాంతి, సౌభ్రాతృత్వాల కోసం కృషి చేస్తామంటూ ఉద్ఘాటన
భారత్, చైనా మధ్య గత కొన్నిరోజులుగా సరిహద్దుల అంశంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీనిపై ఇరుదేశాల సైనికాధికారులు చర్చలు కూడా జరిపారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్ యింగ్ స్పందించారు. సరిహద్దుల వద్ద ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని, పరిస్థితులు చక్కబడ్డాయని తెలిపారు. జూన్ 6న జరిగిన సమావేశంలో చైనా, భారత్ సైనికాధికారులు అన్ని విషయాలు చర్చించారని వెల్లడించారు. సరిహద్దు ఉద్రిక్తతలను నివారించే క్రమంలో ఇరు దేశాలు దౌత్య, సైనిక పరమైన మార్గాల్లో పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకున్నాయని పేర్కొన్నారు.
సమస్యలు పూర్తి నియంత్రణలోకి వచ్చాయని, ఇలాంటి సమస్యలను పరిష్కరించుకునే సత్తా చైనా, భారత్ లకు ఉందని స్పష్టం చేశారు. సంప్రదింపులు, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇరుదేశాల నాయకత్వాలు ఎల్లప్పుడూ సుముఖంగానే ఉంటాయని వివరించారు. ద్వైపాక్షిక సంబంధాలు స్థిరమైన రీతిలో బలోపేతం అయ్యేందుకు వీలుగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పడంలోనూ, తద్వారా విభేదాలు వివాదాలుగా మారకుండా వ్యవహరించడంలోనూ చైనా, భారత్ నాయకత్వాలు పరస్పర అంగీకారంతో వ్యవహరిస్తుంటాయని హువా చున్ యింగ్ వివరించారు.