Amit Shah: కరోనా విషయంలో కేంద్రం తప్పు చేసి ఉండవచ్చు: అమిత్ షా
- కొన్ని సమస్యలు వచ్చిన మాట వాస్తవమే
- వలస కార్మికులు ఇబ్బందులు పడ్డారు
- వారి సంక్షేమం కోసం కట్టుబడివున్నాం
- కేంద్ర నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరన్న అమిత్ షా
దేశంలో కరోనా వైరస్ ను డీల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం తప్పు చేసి వుండవచ్చని, వలస కార్మికుల విషయంలోనూ కొన్ని సమస్యలు వచ్చాయని, అయితే, తమ నిబద్ధతను మాత్రం ఎవరూ ప్రశ్నించజాలరని కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వలస కార్మికుల కోసం రూ.1,70, 000 కోట్లను కేటాయించిందని, వారి కోసం విపక్షాలు ఏం చేశాయని ప్రశ్నించారు. న్యూఢిల్లీ నుంచి ఒడిశాలో జరుగుతున్న ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
వక్ర దృష్టితో చూస్తున్న కొందరు విపక్ష నాయకులు, ప్రతిదాన్నీ రాజకీయం చేయడమే అలవాటుగా చేసుకున్నారని అమిత్ షా మండిపడ్డారు. తమ వైపు నుంచి కొన్ని తప్పులు ఉండి ఉండవచ్చని, కానీ, తాము నిబద్ధతతో పని చేస్తున్నామని తెలిపారు. అనుకున్నదానికన్నా కాస్తంత తక్కువ పని జరిగి ఉండవచ్చని, అంతమాత్రాన తాము ఏమీ చేయలేదని విమర్శిస్తున్న విపక్షాలు, తామేం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇంటర్వ్యూలు ఇస్తూ, విమర్శలు గుప్పించడం తప్ప కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని నిప్పులు చెరిగిన ఆయన, కరోనాపై పోరాటంలో అమెరికా, బ్రిటన్, స్వీడన్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. లాక్ డౌన్ సమయంలో స్వరాష్ట్రాలకు బయలుదేరిన వలస కార్మికులు చాలా కష్టాలను ఎదుర్కొన్నారన్న విషయం తనకు తెలుసునని, ఒడిశాకు సైతం వివిధ రాష్ట్రాల నుంచి 3 లక్షల మంది వచ్చారని, వారందరి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు.
తమ ప్రభుత్వం మే 1 నుంచి శ్రామిక్ రైళ్ల ద్వారా వలస కార్మికులను తరలించాలని భావిస్తే, చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి, వారికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చి పెట్టాయని, తమ రాష్ట్రాలకు రాగానే, వారికి అన్న పానీయాల సౌకర్యం కల్పించి, క్వారంటైన్ సెంటర్లకు తరలించి, అక్కడి నుంచి వెళ్లేటప్పుడు రూ. 2 వేల వరకూ అందించాయని అన్నారు. ఈ విషయంలో విపక్షాలు మాత్రం అనవసరపు ఆరోపణలు చేస్తున్నాయని, వారికి రాజకీయాలు తప్ప మరేమీ అవసరం లేదని అమిత్ షా మండిపడ్డారు.