Sonu Sood: వలసదారులను కలవనీయకుండా సోనూసూద్ నిలిపివేత.. ఆపింది తాము కాదన్న పోలీసులు!
- వలసదారుల కోసం ఎంతో చేస్తున్న సోనూసూద్
- ప్రత్యేక బస్సులతో వారిని సొంత ఊర్లకు పంపుతున్న వైనం
- బాంద్రా రైల్వే స్టేషన్లో సోనూను అడ్డుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది
లాక్ డౌన్ సంక్షోభ సమయంలో ఎంతో మంది వలసదారుల పాలిట సినీ నటుడు సోనుసూద్ ఆపద్బాంధవుడిగా నిలిచాడు. సొంత డబ్బులతో ఆహారం, మాస్కులు తదితరాలను అందజేయడమే కాకుండా... ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఎంతో మందిని వారి స్వస్థలాలకు పంపించాడు. పేదల కోసం ఇంతగా తపన పడుతున్న సోనూసూద్ కు నిన్న చేదు అనుభవం ఎదురైంది. కొందరు వలస కార్మికులను కలుసుకునేందుకు నిన్న ఆయన ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ కు వెళ్లారు. కానీ, వలస కార్మికులను కలవనీయకుండా ఆయనను అక్కడ ఆపేశారు.
ఈ ఘటనపై ముంబై పోలీసులు వివరణ ఇచ్చారు. సోనూసూద్ ను ఆపింది తాము కాదని వారు తెలిపారు. రైల్వే రక్షకదళ సిబ్బంది ఆపేశారని చెప్పారు. యూపీకి వెళ్లేందుకు వలసదారులు శ్రామిక్ రైలు కోసం నిన్న రాత్రి ఎదురు చూస్తున్న సమయంలో సోనూసూద్ అక్కడకు వెళ్లారని తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
మరోవైపు ఈ ఘటనపై శివసేన కీలక నేత సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. శివసేనను తక్కువ చేసి చూపించేందుకు దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ను బీజేపీ తయారు చేసినట్టుందని ఆరోపించారు. ఇదే సమయంలో... సోనూసూద్ మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటూ మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కితాబివ్వడం గమనార్హం.