Mamata Banerjee: అమిత్ షాపై ఘాటుగా స్పందించిన మమతా బెనర్జీ
- బెంగాల్ లో రాజకీయ హింస ఎక్కువవుతోందన్న అమిత్ షా
- దేశంలోని సమ్మిళిత భావాన్ని నాశనం చేసిన వ్యక్తి అమిత్ షా అన్న దీదీ
- ఆయన కళ్ల ముందే విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని వ్యాఖ్య
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్ లో అవినీతి పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ విమర్శలు గుప్పించిన అమిత్ షాపై దీదీ ఘాటుగా స్పందించారు. మన దేశంలోని సమ్మిళిత భావనను ప్రమాదంలోకి నెట్టివేసిన వ్యక్తి, బెంగాల్ సంస్కృతి పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నారు అంటూ అమిత్ షాను విమర్శిస్తూ ఆమె ట్వీట్ చేశారు. అమిత్ షా కళ్ల ముందే అతని వ్యక్తులు విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని... దాన్ని పునఃప్రతిష్టించింది మమతా బెనర్జీ అనే విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. అంతేకాదు ట్వీట్ లో 'అమిత్ షాను తిరస్కరించిన పశ్చిమబెంగాల్' అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు.
బెంగాల్ లో రాజకీయ హింస ఎక్కువవుతోందని అమిత్ షా విమర్శించారు. అవినీతి పెచ్చుమీరిందని అన్నారు. వలసవాదులను తరలిస్తున్న శ్రామిక్ రైళ్లను కరోనా ఎక్స్ ప్రెస్ లుగా పిలుస్తూ కూలీలను మమతా బెనర్జీ అవమానించారని చెప్పారు. ఈ నేపథ్యంలో అమిత్ షాపై మమత ఘాటుగా స్పందించారు.