IIT Gandhinagar: దేశంలోని మురుగునీటిలో కరోనా వైరస్ ఆనవాళ్లు!
- ఐఐటీ గాంధీనగర్ అధ్యయనంలో వెల్లడి
- మానవ విసర్జితాల ద్వారానే బయటకు
- ఇప్పటికే పలు దేశాల్లోని మురుగు నీటిలో వైరస్ గుర్తింపు
దేశంలోని మురుగు నీటిలోనూ కరోనా ఆనవాళ్లు ఉన్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఐఐటీ గాంధీనగర్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. అహ్మదాబాద్‌లోని ఓ మురుగునీటి శుద్ధి కేంద్రం వద్ద నమూనాలను సేకరించి పరిశీలించగా అందులో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించాయి. మానవ విసర్జితాల ద్వారానే వైరస్ జన్యువులు బయటకు వచ్చి మురుగునీటిలో కలిసి ఉంటాయని భావిస్తున్నారు.
వైరస్‌ను గుర్తించి కట్టడి చేసేందుకు మురుగునీటి పరిశీలన విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ మనీశ్ కుమార్ పేర్కొన్నారు. పోలియో వంటి వైరస్‌లను గుర్తించేందుకు ఇప్పటికే ఇలాంటి విధానాన్ని అవలంబిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఇప్పటికే నెదర్లాండ్స్, అమెరికా, స్వీడన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలోనూ మురుగునీటిలో వైరస్ ఆనవాళ్లను గుర్తించారు.