BMC Mayor: ముంబైలో ఐసోలేషన్ నుంచి తప్పించుకుని రైలు కిందపడి రోగి ఆత్మహత్య

Missing Corona Patient died on Railway track

  • సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా తప్పించుకున్న రోగి
  • ఆత్మహత్యా? ప్రమాదమా? అన్న దానిపై పోలీసుల ఆరా
  • దర్యాప్తునకు ఆదేశించిన బీఎంసీ మేయర్

ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకున్న ఓ రోగి రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు. ముంబైలో జరిగిందీ ఘటన. కురార్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు తీవ్ర జ్వరం, కడుపు నొప్పితో బాధపడుతూ నగరంలోని రాజావాడీ ఆసుపత్రిలో చేరాడు. అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో బాధితుడిని ఐసోలేషన్ గదికి తరలించారు. అయితే, మంగళవారం అకస్మాత్తుగా అతను అదృశ్యమయ్యాడు. ఐసోలేషన్‌లో ఉండాల్సిన రోగి కనిపించడం లేదంటూ ఆసుపత్రి వైద్యులు కాండివలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.

మరోవైపు, శతాబ్ది ఆసుపత్రి పక్కనున్న రైలు పట్టాలపై కనిపించిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని చూసిన వైద్యులు ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగి అతడేనని గుర్తుపట్టారు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేదంటే ఐసోలేషన్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురయ్యాడా? అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ ఐసోలేషన్ నుంచి రోగి తప్పించుకోవడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో స్పందించిన బీఎంసీ మేయర్ కిశోరి పడ్నేకర్ దర్యాప్తునకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News