Tirumala: తమకు గుండ్లు చేయాల్సిందేనంటూ తిరుమలలో భక్తుల ధర్నా!
- కల్యాణకట్టను మూసివేస్తూ టీటీడీ నిర్ణయం
- తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న భక్తులు
- స్వామి దర్శనం టోకెన్ల కోసం భారీ ఎత్తున చేరిన భక్తులు
దాదాపు రెండున్నర నెలల తరువాత తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభం కాగా, పలు ఆంక్షలు, నిబంధనల మధ్య గత రెండు రోజులుగా టీటీడీ అధికారులు, స్థానికులు స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తుల ఆరోగ్యం, క్షేమంతో పాటు వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేశఖండనశాలలను మూసి వేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించగా, వాటిని తక్షణమే తిరిగి తెరిపించాలంటూ భక్తులు ఈ ఉదయం టోల్ గేట్ వద్ద ధర్నాకు దిగడం కలకలం రేపింది. వెంకన్న భక్తులు, తమ కోరికలను తీర్చాలంటూ స్వామికి తలనీలాలను భక్తితో సమర్పిస్తారన్న సంగతి తెలిసిందే. భక్తులు సమర్పించే కేశాలతో టీటీడీ కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా పొందుతోంది. తాజాగా వాటిని మూసివేయడంతో తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని భక్తులు వాపోయారు.
ఇదిలావుండగా, తిరుపతిలో ఏర్పాటు చేసే కేంద్రాల ద్వారా రోజుకు 3 వేల దర్శన టికెట్లను ఇస్తామని టీటీడీ వెల్లడించడంతో, ఈ ఉదయం భారీ ఎత్తున భక్తులు టోకెన్ కేంద్రాల వద్దకు చేరారు. దీంతో టోకెన్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.