Vijay Malya: తప్పించుకునేందుకు విజయ్ మాల్యా మరో మాస్టర్ ప్లాన్!
- శరణార్థి పిటిషన్ వేసిన మాల్యా
- పిటిషన్ ప్రాసెస్ కావడానికే ఆరు నెలల సమయం
- తిరస్కరిస్తే, రివ్యూ పిటిషన్ వేసుకునే అవకాశం
ఇండియాలోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి, బ్రిటన్ వెళ్లి తలదాచుకున్న యూబీ గ్రూప్ సంస్థల మాజీ చైర్మన్ విజయ్ మాల్యాను ఇప్పట్లో తిరిగి ఇండియాకు తీసుకువచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బ్రిటన్ సుప్రీంకోర్టు సైతం మాల్యాను భారత్ కు అప్పగించాల్సిందేనని తీర్పిచ్చిన తరువాత, ఆయనకున్న దారులన్నీ మూసుకుపోయాయని, నెల రోజుల్లోనే ఇండియాకు తీసుకుని వస్తారని వార్తలు వచ్చాయి.
కానీ, ఇప్పుడు మాల్యా, తన వద్ద ఉన్న మరో అస్త్రాన్ని బయటకు తీశారు. మానవతా దృక్పథంతో తనకు లండన్ ఆశ్రయం కల్పించాలని కోరుతూ, ఆయన కోర్టులో శరణార్థి పిటిషన్ వేశారు. యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ 3 ప్రకారం ఆయన ఈ పిటిషన్ ను దాఖలు చేయగా, ఈ న్యాయపరమైన చిక్కు పరిష్కారం అయ్యే వరకూ మాల్యాను ఇండియాకు తీసుకురావడానికి వీలుపడదు!
ఇక మాల్యా పెట్టుకున్న దరఖాస్తు ప్రాసెస్ కావడానికే ఆరు నెలల వరకూ సమయం పడుతుందని, చివరకు దీన్ని తిరస్కరించినా, రివ్యూ పిటిషన్ వేసుకునే హక్కు ఆయనకు ఉంటుందని న్యాయ నిపుణులు వెల్లడించారు. శరణార్థిగా మాల్యా అభ్యర్థనకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరిస్తే, ఆయన్ను ఇండియాకు తెచ్చే దారులు మూసుకుపోతాయి.