Philonise Floyd: 20 డాలర్ల కోసం మా అన్న ప్రాణాలు పోయాయి: జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడి ఆక్రోశం
- అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై విచారణ
- కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- కమిటీ ముందు కన్నీటిపర్యంతమైన జార్జ్ సోదరుడు
అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. కాగా, ఈ వ్యవహారంపై అమెరికా ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ ముందు జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనిస్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిలోనిస్ కన్నీటిపర్యంతమవుతూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. తన సోదరుడు ఎవరినీ గాయపర్చకపోయినా, ప్రాణాలు పోయాయని, కేవలం 20 డాలర్ల కారణంగా తన సోదరుడు మరణించడం భరించలేని విషయం అన్నారు.
ఓ నల్లజాతి వ్యక్తి ప్రాణం ఖరీదు 20 డాలర్లా అన్నది ఆలోచించాల్సిన విషయం అని తెలిపారు. నల్లవారు కూడా మనుషులేనని, కానీ తన సోదరుడు బాధతో విలవిల్లాడుతూ సాయం కోరితే ఎవరూ స్పందించలేదని ఫిలోనిస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జరిగిందేదో జరిగిపోయింది.... ఇప్పటికైనా వర్ణవివక్ష రూపుమాపండి అంటూ పిలుపునిచ్చారు. తన సోదరుడి మరణం వృధా పోకుండా చూడాల్సిన బాధ్యత యావత్ ప్రపంచంపై ఉందని అన్నారు.
మినియాపొలిస్ లో మే 25న ఓ షాపులో సిగరెట్లు కొనుక్కున్న జార్జ్ ఫ్లాయిడ్ 20 డాలర్ల నోటు ఇవ్వగా, అది నకిలీదేమోనన్న అనుమానంతో షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి వచ్చిన పోలీసు అధికారుల్లో ఒకరు జార్జ్ ను అదుపులోకి తీసుకునే యత్నంలో అతని మెడను తన మోకాలితో గట్టిగా తొక్కిపెట్టడంతో ఊపిరాడక మరణించాడు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిల్చింది.