Southwest Monsoon: పది రోజుల ముందే తెలంగాణలో అడుగుపెట్టిన రుతుపవనాలు.. ఇక వానలే వానలు!
- పెద్దపల్లి, నిజామాబాద్‌లోకి రుతుపవనాల ప్రవేశం
- రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరణ
- భారీ వర్షాలకు అవకాశం
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. పెద్దపల్లి, నిజామాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోకి నిన్న రుతుపవనాలు ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రెండు మూడు రోజుల్లోనే ఇవి రాష్ట్రమంతా విస్తరిస్తాయని పేర్కొన్నారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయని, వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. శని, ఆదివారాల నాటికి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉందన్నారు.
నిజానికి ఈ నెల 8నే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉండగా, ఈసారి మూడు రోజులు ఆలస్యంగా 11న వచ్చినట్టు అధికారులు తెలిపారు. అయితే, గతేడాదితో పోలిస్తే మాత్రం పది రోజుల ముందే రాష్ట్రంలోకి వచ్చేశాయి.
మరోవైపు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల దగ్గర ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల మాత్రం అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.