Kinjarapu Acchamnaidu: మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన ఏసీబీ... హుటాహుటిన విజయవాడకు తరలింపు!
- భారీ ఎత్తున పోలీసు బలగాలతో కలిసి ఏసీబీ దాడులు
- నిమ్మాడలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు
- ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడిపై ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆపై ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన ఈఎస్ఐ కుంభకోణంలో భాగంగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.
2014 నుంచి 2019 వరకూ ఏపీ కార్మిక మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలను నిర్వహించిన సమయంలో ఈఎస్ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, ప్రస్తుత కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం నేతృత్వంలోని విచారణ కమిటీ ఇప్పటికే, ప్రాథమిక, మధ్యంతర నివేదికలను సమర్పించగా, కాలం తీరిన మందులు కొన్నారని తేలింది. ఇదే సమయంలో అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని, దాదాపు రూ. 900 కోట్ల అక్రమాలు జరిగి వుంటాయని అంచనాకు వచ్చారు.
ఈ నేపథ్యంలో దాదాపు 200 మంది ఏసీబీ అధికారులు 100 మంది పోలీసుల సాయంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిధిలోని నిమ్మాడకు చేరుకుని ఆయన ఇంటిపై సోదాలు నిర్వహించారు. ఆపై ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, విజయవాడకు తరలిస్తున్నట్టు తెలిపారు. అక్కడ ఏ విధమైన అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా, భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
ఇదిలావుండగా, అచ్చెన్నాయుడు చొరవతోనే రూ. 975 కోట్ల మందులను కొనుగోలు చేసిన అధికారులు, రూ. 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించారని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. మందుల కొనుగోలు నిమిత్తం రూ. 293 కోట్లు కేటాయించగా, రూ. 698 విలువైన మందులను కొని, ఖజానాకు రూ. 405 కోట్ల నష్టం కలిగించారన్న ఆరోపణలపై ఏసీబీ విచారణ ప్రారంభించింది. కాగా, అచ్చెన్నాయుడిని రోడ్డుమార్గాన విజయవాడకు తరలిస్తున్నారు. మధ్యాహ్నానికి ఆయన్ను విజయవాడకు తీసుకుని వచ్చే అవకాశం ఉంది.