Donier: యాంటీ వైరల్ దుస్తులు.. 30 నిమిషాల్లోనే కరోనా హతం!

These Fabric Meterial Kill Corona

  • సింగపూర్ సంస్థతో డోనియర్ ఒప్పందం
  • ఆస్ట్రేలియా సంస్థ నుంచి నిర్ధారణ 
  • వైరస్ ను అడ్డుకుంటుందన్న డోనియర్ ఎండీ

కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు పలు కంపెనీలు, పలు రకాల వినూత్న ఉత్పత్తులను తయారు చేసే పనిలో నిమగ్నమైన వేళ, తాజాగా, యాంటీ వైరల్ దుస్తులు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. స్విట్జర్లాండ్ కు చెందిన హీక్యూతో ఒప్పందం పెట్టుకున్న ముంబైకి చెందిన డోనియర్ ఇండస్ట్రీస్ ఈ తరహా దుస్తులను భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. నియో టెక్ బ్రాండ్ కింద ఈ యాంటీ వైరస్ ఫ్యాబ్రిక్ తో తయారైన దుస్తులు అందుబాటులో ఉంటాయి.

ఇక ఈ దుస్తులు 30 నిమిషాల్లోనే ఉపరితలంపై చేరిన వైరస్ ను హతమారుస్తాయని డోనియర్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అగర్వాల్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా తాము అందుకున్నామని తెలిపారు. హీక్యూ వైరోబ్లాక్ ఎన్పీజే 03 సాంకేతికత ద్వారా ఇవి తయారయ్యాయని అన్నారు. ఆస్ట్రేలియా దేశంలోని మెల్ బోర్న్ కేంద్రంగా పనిచేస్తున్న డోహెర్టీ ఇనిస్టిట్యూట్, ఈ దుస్తులపై పరీక్షలు నిర్వహించి, ఇది వైరస్ ను హతమార్చిందని తేల్చిందని అన్నారు.

వైరస్ ను 99.99 శాతం మేరకు విజయవంతంగా ఈ దుస్తులు నిరోధించాయని రాజేంద్ర అగర్వార్ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా యాంటీ వైరల్ దుస్తులు తయారవుతున్నాయని, వీటిని యూఎస్ లోని మెడికల్ టెక్స్ టైల్ సంస్థకు కూడా ఎగుమతి చేస్తున్నామని, ఇండియాలో పోలీసులకు వీటిని సరఫరా చేస్తున్నామని అన్నారు. ఈ దుస్తుల సమర్థత నిర్ధారణ అయిన తరువాత, మార్కెట్ ను పెంచుకునే నిమిత్తం ఉత్పత్తిని కూడా పెంచామని అన్నారు.

వీటిని వినియోగించి వివిధ రకాల యూనిఫామ్ లు, జాకెట్లు, ప్యాంట్లు, చొక్కాలను తయారు చేయవచ్చని వెల్లడించిన ఆయన, ఇది కేవలం పై పూత కాదని, అందువల్ల తరచూ వినియోగించినా, వైరస్ ను అడ్డుకుంటుందని ఆయన తెలిపారు. మామూలు దుస్తులతో పోలిస్తే, దీని ధరలు 20 శాతం వరకూ అధికంగా ఉంటాయని తెలిపారు. జూన్ లో 1000 మంది రిటైల్ వ్యాపారుల నుంచి తమకు ఆర్డర్లు వచ్చాయని, ఈ సంవత్సరం ఈ తరహా దుస్తుల అమ్మకంతో 200 కోట్ల రూపాయల ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News