Inter: ఏపీలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేశ్

Inter results in AP released

  • ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల
  • ఇది చారిత్రాత్మక దినం అని పేర్కొన్న మంత్రి ఆదిమూలపు
  • మరే రాష్ట్రం ఇంతవరకు ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేయలేదన్న మంత్రి

ఏపీలో ఇంటర్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. విజయవాడ హోటల్ గేట్ వేలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఒకేసారి విడుదల చేశారు. దీనిపై మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, దేశం మొత్తం కరోనాతో అల్లకల్లోలంగా మారిన వేళ, ఏ రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో ఏపీ మాత్రమే ఓ పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడించగలిగిందని అన్నారు. మరే రాష్ట్రం ఇంటర్ ఫలితాలు వెల్లడించలేకపోయిందని చెప్పారు.

లాక్ డౌన్ తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, సుమారు 60 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలు వెల్లడించడం మామూలు విషయం కాదని, అందుకే ఇవాళ చారిత్రాత్మకమైన దినంగా భావిస్తున్నామని తెలిపారు. ఫలితాలు చూసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక పాసైన విద్యార్థులు, మొత్తం పాస్ అయిన వారి శాతం గురించి మంత్రి వెల్లడించారు. ఈసారి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,07,230 మంది హాజరయ్యారని, వారిలో 3,00,560 మంది ఉత్తీర్ణులయ్యారని, పాస్ శాతం 59 అని మంత్రి వివరించారు. సెకండియర్ పరీక్షలకు ఈసారి 4,35,655 మంది హాజరయ్యారని, వారిలో పాసైంది 2,76,389 మంది అని, పాస్ శాతం 63 అని తెలిపారు.

ఫలితాల కోసం bie.ap.gov.in, manabadi.com, rtgs.ap.gov.in, results.apcfss.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చు.

  • Loading...

More Telugu News