Corona Virus: కరోనా ఎఫెక్ట్.. నాలుగు రాష్ట్రాలకు నోటీసులు పంపిన సుప్రీంకోర్టు!
- కరోనా కట్టడిలో చేతులెత్తేస్తున్న ప్రభుత్వాలు
- ఢిల్లీలో బెడ్స్ కూడా దొరకని పరిస్థితి
- వార్తాపత్రికల్లోని వార్తలను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు
కరోనా సంక్షోభ సమయంలో సరైన చర్యలను చేపట్టడంలో పలు రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. భారీగా పెరుగుతున్న కేసులతో పరిస్థితి దారుణంగా తయారవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో రోగులకు బెడ్స్ కూడా లభించని దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఢిల్లీ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్స్ ను పశువుల కంటే హీనంగా చూస్తున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది.
కరోనా బాధితులకు సరైన చికిత్సను కూడా అందించలేకపోతున్నారంటూ ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైరస్ కట్టడి చర్యల్లో వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా టెస్టులను తగ్గించడాన్ని తప్పుపట్టింది. కరోనా పరీక్షా కేంద్రాలను పెంచాలని ఆదేశించింది. కరోనా కట్టడి చర్యలకు సంబంధించి ఢిల్లీ సహా తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.