Rana: షూటింగులో రానా 'బరువు' బాధ్యతలు!
- రానా హీరోగా మూడు భాషల్లో 'అరణ్య'
- ఆదివాసీ యువకుడిగా వినూత్న పాత్ర
- ఏనుగు తొండాన్ని మోసిన రానా
- తొండం బరువు 160-170 కిలోలు
కొన్ని రకాల కథా నేపథ్యంతో కూడిన చిత్రాలలో నటించడం అనేది చాలా కష్టతరం. అందులోనూ జంతువుల నేపథ్యంతో సాగే సినిమాలలో నటించడం అనేది మరీ కష్టం. షూటింగులో జంతువుల కాంబినేషన్లో వుండే సన్నివేశాలలో నటించడం ఇబ్బంది కలిగించే వ్యవహారమే. ఇప్పుడు రానా దగ్గుబాటి కూడా 'అరణ్య' సినిమా కోసం అలాంటి కష్టాన్నే పడ్డాడట.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రానా అడవుల్లో సంచరించే ఓ ఆదివాసీ యువకుడిగా .. ఏనుగుల కేర్ టేకర్ గా నటించాడు. అయితే, ఇలా ఏనుగులతో కలసి నటించాల్సి రావడం అన్నది తనకు చాలా ఇబ్బంది అయిందంటున్నాడు.
"బాహుబలి తర్వాత నేను చేసిన సినిమా ఇది. ఇంతవరకు నేను నటించిన సినిమాలలో చాలా కష్టపడింది ఈ సినిమా కోసమే. కొన్ని సన్నివేశాలలో ఏనుగు తొండాన్ని నా భుజాలపై పెట్టుకోవలసి వచ్చేది. ఇక చూడండి.. నా బాధ.. తొండం మామూలు బరువు కాదు. 160 -170 కిలోల బరువు వుంటుంది. దాన్నలా భుజం మీద పెట్టుకునేటప్పటికి ఇక నా పని అయిపోయేది. అందుకే, నేను చేసిన సినిమాలలో ఇది శారీరకంగా బాగా కష్టపడిన సినిమా అవుతుంది' అంటూ చెప్పుకొచ్చాడు రానా. ఇక లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా ప్రకటించలేదు.