Pawan Kalyan: గుంటూరు మార్కెట్ ను వేలం నుంచి తప్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: పవన్ కల్యాణ్
- ప్రజా ఆస్తుల వేలం నుంచి గుంటూరు మార్కెట్ తొలగింపు
- ఏపీ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్
- ఎంతో కృషి చేశారంటూ పార్టీ శ్రేణులకు అభినందనలు
గుంటూరులో ప్రముఖ మార్కెట్ గా పేరొందిన పీవీకే నాయుడు మార్కెట్ ను ప్రజా ఆస్తుల వేలం జాబితా నుంచి తప్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని గుంటూరు మార్కెట్ ను వేలం జాబితా నుంచి తొలగించాలన్న సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మార్కెట్ పై ఎంతోమంది పేదలు ఆధారపడి ఉన్నారని, చిన్న దుకాణాల వారు, బళ్లపై కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకుంటూ జీవించేవారు ఉన్నారని, వారందరికీ ఈ నిర్ణయం ఊరట కలిగిస్తుందని పేర్కొన్నారు.
అయితే, రాష్ట్రంలో మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో విలువైన ప్రజా ఆస్తులు అమ్మడం సరికాదని, ఆస్తులు అమ్మడం అంటే పాలనాపరంగా ప్రణాళిక లేకపోవడమేనని స్పష్టం చేశారు. గుంటూరు మార్కెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో, ఇతర ప్రజా ఆస్తుల అమ్మకం విషయంలోనూ అలాంటి నిర్ణయమే తీసుకోవాలని పవన్ సూచించారు. ఉన్న ఆస్తులు అమ్మితే సంపద సృష్టి జరగదని హితవు పలికారు. ఈ సందర్భంగా పవన్ జనసేన శ్రేణులను అభినందించారు. గుంటూరు పీవీకే నాయుడు మార్కెట్ ను వేలం నుంచి తప్పించడంలో ఎంతో కృషి చేశారంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను పేరుపేరునా ప్రశంసించారు.