Mumbai: ముంబయిలో నిండుకున్న ఐసీయూలు... కొత్త కేసులొస్తే చేతెలెత్తేయడమే!
- దేశ ఆర్థిక రాజధానిలో కరోనా విజృంభణ
- ఇండియాలోని మొత్తం కేసుల్లో 30 శాతం మహారాష్ట్రలోనే
- కొత్త కేసులకు బెడ్లు, వెంటిలేటర్లు లేవంటున్న వైద్యులు
దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభణతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇండియాలో మూడు లక్షలకుపైగా కరోనా కేసులు ఉండగా, అందులో 30 శాతానికి పైగా... అంటే, లక్ష కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. అందులోనూ ముంబయిలో 55 వేల కేసులకు పైగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లు నిండిపోయాయి. ఇకపై వచ్చే రోగులకు ఎక్కడ చికిత్స అందించాలో తెలియని పరిస్థితి నెలకొందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ముంబయిలో 99 శాతం ఐసీయూ బెడ్లు, 94 శాతం వెంటిలేటర్లను కరోనా రోగుల చికిత్స నిమిత్తం వాడుతున్నామని ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్వయంగా పేర్కొంది. ఈ నెల 11 నాటికి నగరంలోని మొత్తం 1,181 ఐసీయూ పడకల్లో 1, 167 పడకలను కరోనా తీవ్రమైన వారి కోసం వినియోగిస్తున్నామని, మిగిలిన 14 పడకలూ శనివారం రాత్రికే నిండిపోవచ్చని అధికారులు వెల్లడించారు.
ఇక వెంటిలేటర్ల విషయానికి వస్తే, అందుబాటులో ఉన్న 530 వెంటిలేటర్లలలో 497 రోగులకు అమర్చామని, 5,260 ఆక్సిజన్ పడకలలో 3,986 (76 శాతం) వాడుకలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కరోనా సోకిన సాధారణ రోగుల కోసం 10,450 పడకలు అందుబాటులో ఉండగా, 9,098 పడకలు (87 శాతం) నిండిపోయాయని అధికారులు వెల్లడించారు. బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.