Kinjarapu Acchamnaidu: అచ్చెన్నాయుడు ఖైదీ నంబర్ 1573,,, కేసులో ఏ-2!
- ఈఎస్ఐ స్కామ్ లో శుక్రవారం అరెస్ట్
- ఆరోగ్యం బాగాలేకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి
- యాంటీ బయాటిక్స్ ఇస్తున్న వైద్యులు
ఈఎస్ఐ స్కామ్ లో భాగంగా పోలీసులు అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అనారోగ్య కారణాల దృష్ట్యా పోలీసులు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన్ను రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించగా, నంబర్ 1573ని జైలు అధికారులు కేటాయించారు.
ఈ కేసులో ఏ-1గా రమేశ్ కుమార్ ను చేర్చిన పోలీసులు ఏ-2గా అచ్చెన్నాయుడిని, ఏ-3గా ప్రమోద్ రెడ్డి పేర్లను చేర్చారు. కాగా, అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఏసీబీ పేర్కొంది. ప్రస్తుతం ఆయనకు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లోని పొదిలి ప్రసాద్ బ్లాక్ లో ఉన్న తొలి అంతస్తులోని ప్రత్యేక గదిలో వైద్య చికిత్సను అందిస్తున్నారు.
ఇటీవల ఆయనకు మొలల ఆపరేషన్ జరుగగా, ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడినట్టు తెలుస్తోంది. రక్తస్రావం అవుతూ ఉండటంతో, వైద్యులు యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు. రక్తస్రావం తగ్గకుంటే మళ్లీ ఆపరేషన్ చేస్తామని వైద్యులు అంటున్నారు.