Chandrababu: ఫిడెల్ క్యాస్ట్రో మాటలు రాష్ట్రంలో ఇప్పుడు నిజమయ్యాయి: చంద్రబాబు
- రాష్ట్రంలో రాక్షసపాలన అంటూ ఆగ్రహం
- సినిమా ముందుంది అనడం శాడిజం అని పేర్కొన్న చంద్రబాబు
- కోర్టు తీర్పులతో జగన్ లో అసహనం రెట్టింపైందంటూ వ్యాఖ్యలు
- అందుకే దాడులకు దిగారని వెల్లడి
ఏపీలో తాజా పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అచ్చెన్నాయుడు, జేసీల అరెస్టులపై మాట్లాడుతూ, దశాబ్దాలుగా ప్రజాదరణ ఉన్న రాజకీయ కుటుంబాలపై జగన్ కక్షగట్టారని ఆరోపించారు. పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడును 7 జిల్లాల్లో 24 గంటల పాటు తిప్పడం రాక్షస పాలనకు నిదర్శనం అని విమర్శించారు. ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుంది అంటూ వ్యాఖ్యలు చేయడం వైసీపీ శాడిజానికి పరాకాష్ఠ అని పేర్కొన్నారు. నేరస్తుడు పాలకుడైతే నిరపరాధులు జైల్లో ఉంటారన్న ఫిడెల్ క్యాస్ట్రో మాటలు రాష్ట్రంలో నిజమయ్యాయని పేర్కొన్నారు.
ప్రజావ్యతిరేక నిర్ణయాలు కాబట్టే కోర్టులు కూడా చాలా జీవోలను రద్దు చేశాయని వెల్లడించారు. కోర్టు తీర్పులతో జగన్ లో అసహనం రెట్టింపై ప్రజలపై దాడికి తెగించారని మండిపడ్డారు. ఈఎస్ఐ వ్యవహారంపై విచారణ జరుగుతుండగా టెలీ మెడిసిన్ కాంట్రాక్టర్ కు రూ.3 కోట్లు ఏ విధంగా చెల్లించారని ప్రశ్నించిన చంద్రబాబు, దీనిపై ప్రస్తుత మంత్రిని అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు.
ప్రభుత్వ పనులకు సీఎం జగన్ కంపెనీ సిమెంటే కొనుగోలు చేయాలా? సొంత కంపెనీ సరస్వతి పవర్ కోసం 50 ఏళ్లకు గనులు లీజుకు తీసుకుంటారా? అంటూ విమర్శలు గుప్పించారు. నాసిరకం మద్యం బ్రాండ్లతో జె ట్యాక్స్ రూపంలో ఏడాదికి రూ.5 వేల కోట్ల వసూళ్లు వస్తున్నాయని ఆరోపించారు. కరోనా కిట్లు, మాస్కులు, బ్లీచింగ్ కొనుగోళ్లలోనూ వందల కోట్ల దోపిడీ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 కేసుల్లో ఏ1 నిందితుడు జగన్ రూ.43 వేల కోట్ల దోపిడీ చేశాడని అన్నారు. ఏడాది పాలనలోనూ అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని వెల్లడించారు. మీ అవినీతి బురద టీడీపీకి అంటించి ప్రజాస్వామ్యాన్నే పరిహాసం చేస్తారా? అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.
తప్పుడు కేసులు పెట్టి కోడెల శివప్రసాదరావును బలిగొన్నారని, దాదాపు 60 మంది టీడీపీ సీనియర్లపై అక్రమ కేసులు బనాయించారని, 9 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేరస్తులకు భయపడే పార్టీ కాదని, సత్యం వెన్నంటే టీడీపీ ఉంటుందని, అబద్ధాల్లో బతికే పార్టీ వైసీపీ అని ధ్వజమెత్తారు.