Rajnath Singh: భారత్ ఎంతమాత్రం బలహీన దేశం కాదు: రాజ్ నాథ్
- త్వరలోనే అన్ని విషయాలు పంచుకుంటామని వెల్లడి
- ఏ దేశాన్ని భయపెట్టబోమని స్పష్టీకరణ
- దేశ రక్షణే ప్రధాన ధ్యేయం అని ఉద్ఘాటన
చైనాతో సరిహద్దు సమస్య నేపథ్యంలో భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తమ వైఖరిని స్పష్టం చేశారు. భారత్ ఎంతమాత్రం బలహీన దేశం కాదని, దేశ రక్షణ పాటవం మరింత పెరిగిందని అన్నారు. సరిహద్దుల్లో ఏంజరుగుతోందన్న దానిపై పార్లమెంటును, విపక్షాలను తాము మభ్యపెట్టడంలేదని, సరైన సమయంలో అన్ని విషయాలు పంచుకుంటామని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దేశ ప్రతిష్ఠను తాకట్టు పెట్టబోమని హామీ ఇస్తున్నానని తెలిపారు.
"భారత్ ఇప్పుడు ఎంతో శక్తిమంతమైన దేశం. జాతీయ భద్రతా సామర్థ్యం రెట్టింపైంది. అంతమాత్రాన మన బలాన్ని మరో దేశాన్ని భయపెట్టేందుకు ఉపయోగించబోం. దేశ రక్షణే ప్రధాన ధ్యేయం" అని స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చైనా ప్రతిపాదించిందని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన కూడా అదేనని రాజ్ నాథ్ వెల్లడించారు.