Chandrababu: ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ.. చంద్రబాబు లేఖలు
- వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి లేఖలు
- మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున సాయం
- గ్యాస్ లీకేజీతో మృతి చెందడం హృదయవిదారకమన్న చంద్రబాబు
- ఎల్జీ పాలిమర్స్ సంస్థను వైసీపీ వెనకేసుకొస్తోందని వ్యాఖ్య
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల కుటుంబాలకు చంద్రబాబు లేఖలు రాశారు. వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి ఆయన రాసిన లేఖలను టీడీపీ నేతలు మృతుల కుటుంబ సభ్యులను కలిసి అందజేయనున్నారు. గ్యాస్ లీకేజీ ఘటన మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.50 వేల సాయం చేయనున్నారు.
గ్యాస్ లీకేజీతో వారు మృతి చెందడం హృదయవిదారకమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 15 మంది మృతి చెందడం తన మనసును కలచివేసిందని ఆయన చెప్పారు. వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందడం చూసి తాను చలించిపోయానని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థను వైసీపీ సర్కారు వెనకేసుకురావడం విచారకరమని ఆయన తెలిపారు.
మృతుల కుటుంబాలను వ్యక్తిగతంగా పరామర్శించానికి వైసీపీ సర్కారు సహకరించట్లేదని చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్న సమయాల్లో వారికి టీడీపీ అండగా ఉంటోందని అన్నారు. గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలకు రూ.50 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నామని అన్నారు.