Madhya Pradesh: మధ్యప్రదేశ్ లోని దేవాలయంలో తాకకుండానే మోగే గంట ఏర్పాటు... వీడియో ఇదిగో!
- తెరచుకున్న దేవాలయాల తలుపులు
- భక్తులు తాకకుండా సెన్సార్ సాయంతో మోగే గంట
- చెయ్యి చూపగానే గణగణ గంటలు
ఎన్నో వారాల లాక్ డౌన్ తరువాత దేవాలయాలు తెరచుకున్నాయి. ఒకరిని ఒకరు తాకకుండా దర్శనాలకు వెళ్లే నిబంధన పక్కాగా అమలవుతూ ఉన్న వేళ, గుళ్లలో తీర్థం, చటారీలను ఇప్పటికే రద్దు చేశారు. మరి గుడిలో గంటల సంగతి... గంటను ఒకరి తరువాత మరొకరు తాకుతూ ఉంటే వైరస్ సులువుగా వ్యాపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వినూత్నంగా ఆలోచించిన మధ్యప్రదేశ్ లోని మందాసుల్ ప్రాంతంలో ఉన్న పశుపతినాథ్ దేవాలయం అధికారులు ఎవరూ తాకకుండానే గంట కొట్టుకునే ఏర్పాటు చేశారు.
దీంతో ఆ గంట కింద నిలబడి, దాన్ని కొడుతున్నట్టు అనుభూతి చెందుతున్న భక్తులు, ఈ ఏర్పాటు బాగుందని, ఇదే తరహాలో కాంటాక్ట్ లెస్ గంట విధానాన్ని అన్ని దేవాలయాల్లోనూ ప్రవేశపెట్టాలని అడుగుతున్నారు. ఈ గంట సెన్సార్ సాయంతో పనిచేయడం గమనార్హం. ఎవరైనా దాని కిందకు వచ్చి పైకి చెయ్యి చాస్తేనే అది మోగుతుంది.
కాగా, ఈ గంటను ఓ ముస్లిం వయోవృద్ధుడు తయారు చేయడం గమనార్హం. 62 సంవత్సరాల నారూ ఖాన్ మేవ్ దీన్ని తయారు చేశారు. దీని కోసం తాను ఓ సెన్సార్ ను ఇండోర్ నుంచి తెచ్చి, రూ. 6 వేలు ఖర్చు పెట్టి, ఆలయంలో గంట దానంతట అదే మోగేలా చేశానని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.