Indian High Commission: అనుకున్నదే జరిగింది.... పాక్ అదుపులో భారత దౌత్య సిబ్బంది... భారత్ ఒత్తిళ్లతో విడుదల
- ఈ ఉదయం అదృశ్యమైన దౌత్య అధికారులు
- ఇస్లామాబాద్ లో ఓ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు సమాచారం
- హిట్ అండ్ రన్ కేసులో అరెస్టయ్యారని పేర్కొన్న పాక్ మీడియా
పాకిస్థాన్ లో ఈ ఉదయం ఇద్దరు భారత దౌత్య సిబ్బంది ఆచూకీ లేకుండా పోవడం తీవ్ర కలకలం రేపింది. పనిమీద బయటికి వెళ్లిన ఆ ఇద్దరు అధికారులు తిరిగి రాకపోవడంతో పాకిస్థాన్ లో భారత హై కమిషన్ కార్యాలయంలో ఆందోళన నెలకొంది. వారిద్దరినీ గూఢచారులన్న నెపంతో పాక్ భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకుని ఉండొచ్చని భావించారు. ఇప్పుడా అనుమానమే నిజమైంది. భారత దౌత్య అధికారులు పాక్ ఐఎస్ఐ అధీనంలో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం వారిద్దరూ ఇస్లామాబాద్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు భారత హైకమిషన్ కు సమాచారం అందింది.
ఇద్దరు భారత అధికారులను హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేసినట్టు పాక్ మీడియాలో వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్ లో పాకిస్థాన్ రాయబారి సయ్యద్ హైదర్ షాకు హోంమంత్రిత్వ శాఖ సమన్లు పంపింది. ఇస్లామాబాద్ లోని ఇద్దరు భారత దౌత్య సిబ్బంది బాధ్యత పాకిస్థాన్ దేనని, విచారణ పేరుతో వారిపై వేధింపులకు పాల్పడితే సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఆ ఇద్దరినీ పూర్తి భద్రత నడుమ భారత హైకమిషన్ కార్యాలయానికి పంపించాలని తెలిపింది.
ఇదిలావుంచితే, భారత్ నుంచి ఒత్తిళ్లు పెరగడంతో వారిద్దరినీ పాక్ విడుదల చేసింది. ప్రస్తుతం వారిద్దరూ భారత హైకమిషన్ కార్యాలయానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.