Tata Motors: రూ. 9,894 కోట్ల నష్టాల్లో టాటా మోటార్స్!

Tata Motors Loss in Forth Quarter

  • మార్చితో ముగిసిన త్రైమాసికం ఫలితాల విడుదల
  • 27.7 శాతం తగ్గిన ఆదాయం
  • ఏప్రిల్ - జూన్ లో మరింతగా తగ్గనున్న రెవెన్యూ

దేశంలో అత్యధికంగా వాహనాలను విక్రయిస్తున్న రెండో అతిపెద్ద సంస్థ టాటా మోటార్స్ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ. 9,894 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు 2019 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఇదే సమయంలో రూ. 1,117 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సోమవారం నాడు స్టాక్ మార్కెట్ ముగిసిన తరువాత టాటా మోటార్స్ ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు వెల్లడించింది.

ఇక ఈ మూడు నెలల కాలంలో సంస్థ ఆదాయం 27.7 శాతం తగ్గి రూ. 62,493 కోట్లకు పడిపోయింది. సంస్థ మార్కెటింగ్ చేస్తున్న జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ విభాగంలో పన్ను చెల్లింపుల తరువాత 201 మిలియన్ పౌండ్ల నష్టం నమోదుకావడం, మార్చి త్రైమాసికం ఫలితాలపై ప్రభావం చూపింది. మొత్తంమీద 2019-2020 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టం రూ. 12,071 కోట్లుగా నమోదైంది.

లాక్ డౌన్, కరోనా వైరస్ కారణంగా నష్టాలు పెరిగాయని సంస్థ పేర్కొన్నప్పటికీ, లాక్ డౌన్ ప్రభావం తదుపరి త్రైమాసికం... అంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్ - జూన్ నెలలో ఇంకా అధికంగా ఉంటుంది కాబట్టి, సంస్థ నష్టాలు, మొదటి క్వార్టర్ లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వాహన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

"ఇండియాలో నూతన వాహన డిమాండ్ గణనీయంగా పడిపోయింది. ద్రవ్య లభ్యత సక్రమంగా లేదు. ఇదే సమయంలో బీఎస్-6 నిబంధనలు అమలు చేయాల్సి వచ్చింది. ఆపై కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్. ఈ అంశాలన్నీ సంస్థ గణాంకాలపై ప్రభావం చూపించాయి" అని టాటా మోటార్స్ తన ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News