Harbhajan singh: జట్టును నాశనం చేసి పడేశాడు.. మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌పై విరుచుకుపడిన భజ్జీ
- విభజించు, పాలించు సూత్రాన్ని అమలు చేశాడు
- జట్టును ఎలా నాశనం చేయాలో అతడి కంటే బాగా మరెవరికీ తెలియదు
- ఆ సమయంలో భారత క్రికెట్‌లో తప్పుడు వ్యక్తులు ఉన్నారనిపించింది
టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌పై హర్భజన్ సింగ్ విరుచుకుపడ్డాడు. కోచ్‌గా చాపెల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బలమైన భారత జట్టు కాస్తా అధ్వానంగా మారిపోయిందన్నాడు. విభజించు, పాలించు సూత్రాన్ని చాపెల్ అమలు చేశాడని విమర్శించాడు.
అతడు ఏ ఉద్దేశంతో వచ్చాడో ఎవరికీ తెలియదని, కానీ పటిష్టమైన జట్టును బలహీనంగా ఎలా మార్చాలో అతడి కంటే గొప్పగా మరెవరికీ తెలియదని అన్నాడు. ఆ సమయంలో భారత క్రికెట్‌లో తప్పుడు వ్యక్తులు ఉన్నారని భావించానని, నాశనం చేయాలని చూస్తున్నారని అనిపించిందని పేర్కొన్న భజ్జీ.. అందుకే జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనిపించలేదన్నాడు. చాపెల్ తీరుతోనే 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి దశలోనే వెనుదిరిగిందని అన్నాడు.