Home Guard: హోంగార్డుకు కరోనా... కాణిపాకం ఆలయం రెండ్రోజుల పాటు మూసివేత
- ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- కాణిపాకం ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు
- హోంగార్డుకు పాజిటివ్
- ఆలయాన్ని క్రిమి సంహారక ద్రావణాలతో శుభ్రపరచాలని నిర్ణయం
ఏపీలో కరోనా వైరస్ భూతం నలుమూలలకు పాకిపోతోంది. తాజాగా, చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో కరోనా కలకలం రేగింది. ఆలయం వద్ద భద్రతా విధుల్లో ఉన్న ఓ హోంగార్డుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆలయాన్ని రెండ్రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. ఆలయాన్ని క్రిమి సంహారక ద్రావణాలతో శుద్ధి చేయనున్నారు.
అనంతరం ఆలయాన్ని తిరిగి గురువారం తెరుస్తారు. ఇటీవల ఆలయాలు తెరవచ్చంటూ కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాణిపాకం ఆలయంలోని సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా, హోంగార్డుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇంతకుముందు, శ్రీకాళహస్తి ఆలయంలో ఓ అర్చకుడికి కరోనా సోకింది. దాంతో ఆలయాన్ని మూసివేసి రసాయనాలతో శుభ్రపరిచారు.