Nara Lokesh: అనంతపురం జిల్లాలో వైసీపీ ఎంపీ ఆధ్వర్యంలో మీడియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: లోకేశ్
- మీడియాకు ప్రశ్నించే హక్కు లేదా అంటూ లోకేశ్ ఆగ్రహం
- జీవో 2430 తీసుకువచ్చి మీడియా గొంతు నొక్కారని వ్యాఖ్యలు
- వైసీపీ నేతలది అధికార మదం అంటూ మండిపాటు
అనంతపురం జిల్లాలో ఎంపీ గోరంట్ల మాధవ్ సమక్షంలో మీడియా ప్రతినిధులపై దాడి జరిగిందంటూ టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో మీడియా ప్రతినిధులపై వైసీపీ ఎంపీ ఆధ్వర్యంలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. రాజారెడ్డి రాజ్యాంగంలో మీడియాకు కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేదని చెప్పడమే ఈ దాడి ఉద్దేశం అని విమర్శించారు. వైసీపీ సర్కారు జీవో 2430 తీసుకువచ్చి మీడియా గొంతు నొక్కిందని మండిపడ్డారు.
గతంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో పాత్రికేయులపై వైసీపీ రౌడీ నాయకులు హత్యాయత్నం చేశారని, అమరావతి ఉద్యమం సందర్భంగా పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టారని లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. వైసీపీ నేతలు అధికార మదంతో వ్యవస్థల్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో మీడియాపై దాడి వీడియోను కూడా లోకేశ్ పంచుకున్నారు.