High Commission: రాడ్లతో కొట్టి మురికి నీళ్లు తాగించారు... భారత దౌత్య సిబ్బందికి పాక్ లో చిత్రహింసలు
- పాకిస్థాన్ లో నిన్న హైడ్రామా
- కనిపించకుండాపోయిన ఇద్దరు భారత దౌత్య సిబ్బంది
- 12 గంటల తర్వాత వారిని విడిచిపెట్టిన పాక్ భద్రతా బలగాలు
పాకిస్థాన్ లో భారత హైకమిషన్ ఉద్యోగులను అక్కడి భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని దాదాపు 12 గంటల హైడ్రామా తర్వాత విడిచిపెట్టడం తెలిసిందే. సోమవారం ఉదయం ఇస్లామాబాద్ లోని ఓ పెట్రోల్ బంకు వద్ద వారిని అదుపులోకి తీసుకున్న పాక్ సాయుధ బలగాలు వారి చేతులకు సంకెళ్లు వేసి, కళ్లకు గంతలు కట్టి రహస్య ప్రదేశానికి తరలించగా, ఆ విషయం తెలియని భారత హైకమిషన్ తమ ఉద్యోగులు అదృశ్యం కావడం పట్ల తీవ్ర ఆందోళన చెందింది. దీనిపై సమాచారం అందుకున్న భారత ప్రభుత్వం దౌత్యమార్గాల్లో పాక్ పై ఒత్తిడి పెంచడంతో ఎట్టకేలకు ఆ ఉద్యోగులిద్దరికీ విముక్తి లభించింది.
కాగా, ఆ ఇద్దరు ఉద్యోగులను గంటల పాటు తమ అదుపులో ఉంచుకున్న భద్రతా బలగాలు వారిని చిత్రహింసలకు గురిచేశాయి. ఇనుపరాడ్లతో, కర్రలతో కొట్టడమే కాకుండా, మురికి నీళ్లు తాగించినట్టు తెలిసింది. చివరికి రాత్రి 9 గంటల సమయంలో వారిని భారత హైకమిషన్ కు అప్పగించారు. కాగా, దీనిపై పాక్ మీడియాలో భిన్న కథనాలు వచ్చాయి. భారత హైకమిషన్ ఉద్యోగులు ఓ రోడ్డు ప్రమాదానికి కారకులు కావడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు వక్రభాష్యం చెప్పాయి.