Atchannaidu: అచ్చెన్నాయుడికి రక్తస్రావం.. బెయిల్ కోసం దరఖాస్తు
- సుదీర్ఘ ప్రయాణం కారణంగా తిరగబెట్టిన పుండు
- పుండు తగ్గడానికి రెండు వారాలు పట్టవచ్చని సమాచారం
- ఆరోగ్య సమస్యలతో బెయిల్ కు దరఖాస్తు
ఈఎస్ఐ కేసులో రిమాండులో ఉన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న ఆయనను ఏసీబీ పోలీసులు శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. సుదీర్ఘ ప్రయాణం కారణంగా ఆయన ఆపరేషన్ గాయం తిరగబెట్టింది. పుండు నుంచి రక్తస్రావం అవుతున్నట్టు సమాచారం. ఆయనకు బీపీ, షుగర్ ఉన్నాయి. దీనికి తోడు ఒత్తిడి కూడా పెరగడంతో సమస్య తీవ్రత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో, ఆయన పుండు తగ్గడానికి రెండు వారాలకు పైనే పట్టవచ్చని చెపుతున్నారు.
మరోవైపు, అచ్చెన్న ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అచ్చెన్నకు బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టులో ఆయన తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు పిటిషన్ వేశారు. ఆన్ లైన్లో పిటిషన్ దాఖలైంది. దీనికితోడు, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు వీలుగా అనుమతిని ఇవ్వాలని మరో పిటిషన్ కూడా వేశారు.