China: భారత్-చైనా ఘర్షణ: 20 మంది భారత సైనికులు, 43 మంది చైనా సైనికుల మృతి?
- ఐదు దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో ఘర్షణ
- వాస్తవాధీన రేఖను దాటేందుకు యత్నించిన చైనా బలగాలు
- ఇరు దేశాల సైనికుల బాహాబాహీ, రాళ్ల దాడి
లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు వైపులా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. భారత్ ముగ్గురు సైనికులను కోల్పోయినట్టు ఇప్పటి వరకు వార్తలు రాగా, వాస్తవానికి 20 మంది సైనికులు అమరులైనట్టు తెలుస్తోంది. అలాగే, చైనా వైపు కూడా భారీగానే ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం. దాదాపు 5 దశాబ్దాల తర్వాత ఇరు దేశాల మధ్య ఈ స్థాయిలో ఘర్షణలు జరిగినట్టు ఆర్మీ పేర్కొంది. అయితే, ఇక్కడ కాల్పులు జరగలేదని, ఇరు దేశాల సైనికుల బాహాబాహీ, రాళ్ల దాడిలోనే సైనికులు అమరులయ్యారని పేర్కొంది.
నిజానికి ఈ ఘటనలో ఇరు దేశాలు సైనికులను భారీగానే నష్టపోయినట్టు తెలుస్తోంది. భారతదేశం 20 మంది సైనికులను పోగొట్టుకోగా, చైనా వైపు ఏకంగా 43 మంది మరణించినట్టు ‘ఏఎన్ఐ‘ పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని ఆర్మీ నిర్ధారించాల్సి ఉంది. 15న రాత్రి చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటేందుకు ప్రయత్నించడంతో భారత బలగాలు అడ్డుకున్నాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు పేర్కొంది. ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నిన్న ప్రధానితో భేటీ కాగా, ఆ తర్వాత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.