Dexamethasone: కరోనాపై పని చేస్తున్న స్టెరాయిడ్... ముందే తెలిస్తే 5 వేల మంది ప్రాణాలు కాపాడేవాళ్లమన్న ఆక్స్ ఫర్డ్!
- సత్ఫలితాలను ఇస్తున్న డెక్సామెథాసోన్
- వెంటిలేటర్ పై ఉన్నా కోలుకుంటున్న బాధితులు
- ఒక కోర్సుకు ఇండియాలో రూ. 75 మాత్రమే
కరోనాపై పోరాడుతున్న ప్రపంచానికి ఆక్స్ ఫర్డ్ శుభవార్త చెప్పింది. సాధారణంగా అందుబాటులో ఉండే డెక్సామెథాసోన్ అనే స్టెరాయిడ్, ఈ వైరస్ పై పని చేస్తున్నదని, ఈ విషయాన్ని ముందే తాము గమనించివుంటే, బ్రిటన్ లో కనీసం ఐదువేల మంది ప్రాణాలను కాపాడివుండేవాళ్లమని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మార్టిన్ లాండ్రే అన్నారు. బ్రిటన్ లో ఈ స్టెరాయిడ్ ను ఇచ్చి మంచి ఫలితాలను పొందామని, దీన్ని వెంటిలేటర్ పై ఉన్న రోగులకు ఇస్తే, 35 మంది, సప్లిమెంట్ ఆక్సిజన్ అవసరమున్న రోగులకు ఇస్తే, 20 శాతం కోలుకున్నారని ఆయన తెలియజేశారు.
ఇక, ఈ స్టెరాయిడ్, అతి తక్కువ ఖర్చులోనే లభిస్తుందని, ఎన్హెచ్ఎస్ లో ఈ కోర్స్ తీసుకోవడానికి ఐదు పౌండ్ల వరకూ ఖర్చయితే, ఇండియాలో దాదాపు రూ. 75 (ఒక డాలర్) వరకూ మాత్రమే అవుతుందని ఆయన అన్నారు. తాము 2,104 మందికి డెక్సామెథాసోన్ ఇచ్చామని, సత్ఫలితాలను పొందామని మార్టిన్ తెలిపారు. దీన్ని రోజుకి 6 ఎంజీ చొప్పున టాబ్లెట్ ద్వారా కానీ, నరానికి ఇంజెక్షన్ ద్వారా కానీ పది రోజుల పాటు ఇవ్వాల్సి వుంటుందని, ఇప్పటి వరకు ఏ ఔషధం ఇవ్వలేనంత ప్రయోజనం ఈ మందు ద్వారా లభించిందని ఆయన అన్నారు.