India: ఘర్షణలో ఇండియాకన్నా మాకే ఎక్కువ నష్టం జరిగింది.. ఒప్పుకున్న చైనా!
- వెల్లడించిన చైనా రక్షణ శాఖ ప్రతినిధి
- మృతుల సంఖ్యను మాత్రం వెల్లడించని వైనం
- సరిహద్దులకు సైన్యాన్ని తరలిస్తున్న ఇరు దేశాలు
నిన్న రాత్రి భారత సరిహద్దులను దాటి చొచ్చుకుని వచ్చి దారుణంగా దాడికి దిగిన చైనా, మన జవాన్ల చేతిలో చావుదెబ్బతింది. ఇండియాతో జరిగిన ఘర్షణల్లో తమ జవాన్లు మరణించారని చైనా ప్రకటించింది. మృతుల సంఖ్యను మాత్రం అధికారికంగా వెల్లడించేందుకు చైనా ప్రతినిధి నిరాకరించారు. ఇండియాకన్నా తమకే అధికంగా నష్టం వాటిల్లిందని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారని చైనా అధికార మీడియా 'క్సిన్హువా' వెల్లడించింది. భారత జవాన్లే తొలుత దాడికి దిగారని చెబుతూ, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తరలించామని పేర్కొంది.
కాగా, ఈ దాడిలో 20 మంది భారత జవాన్లు మరణించగా, 30 మందికి పైగా చైనా జవాన్లు మరణించి వుండవచ్చని తెలుస్తోంది. సరిహద్దుల్లో వివాదం తరువాత, ఆ ప్రాంతానికి భారీ ఎత్తున చైనా బలగాలను తరలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఇండియా కూడా మరిన్ని ఆయుధాలను అదే ప్రాంతానికి ఇప్పటికే తరలించడంతో పాటు జమ్మూ కాశ్మీర్ లోని రెజిమెంట్లలో ఉన్న సైన్యాన్ని, లడఖ్ ప్రాంతానికి పంపుతోంది.