Supreme Court: కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
- ఆసుపత్రుల్లో మరణించిన వారికీ కరోనా పరీక్షలు చేయాలన్న హైకోర్టు
- హైకోర్టు ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ సర్కారు
- ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు
ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలంటూ ఇటీవల హైకోర్టు తెలంగాణ సర్కారును ఆదేశించగా, ఆ ఆదేశాలను తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇక వాదనల సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా తన అభిప్రాయాలు వినిపించింది. అందరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలు, ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు లోబడే కరోనా పరీక్షలు చేస్తున్నట్టు న్యాయస్థానానికి తెలిపింది. తెలంగాణ సర్కారు వాదనల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం ఈ వ్యవహారంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.