Laywer: సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంలో సల్మాన్ ఖాన్, కరణ్ జొహార్ లపై క్రిమినల్ కంప్లెయింట్

A Laywer files criminal complaint against Salman Khan and Karan Johar
  • కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన పాట్నా న్యాయవాది
  • సుశాంత్ పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపణ
  • ఈ ఫిర్యాదులో సాక్షిగా కంగన పేరు
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు ఇప్పటికీ తెలియలేదు. తనను ఇండస్ట్రీలో ఉద్దేశపూర్వకంగా తొక్కేశారన్న భావనతో డిప్రెషన్ కు లోనై ఆత్మహత్యకు పాల్పడినట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది బీహార్ లోని పాట్నా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ సహా ఎనిమిది మంది బాలీవుడ్ సెలబ్రిటీలపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు.

కుట్రపూరితంగా వ్యవహరించి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను ఆత్మహత్యకు పురికొల్పారని సుధీర్ కుమార్ తన ఫిర్యాదులో ఆరోపించారు. దీన్ని హత్య కింద పరిగణించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. కాగా, సుధీర్ కుమార్ తన ఫిర్యాదులో ఆదిత్య చోప్రా, సాజిద్ నడియడ్ వాలా, సంజయ్ లీలా భన్సాలీ, భూషణ్ కుమార్, ఏక్తా కపూర్, డైరెక్టర్ దినేశ్ లపైనా ఆరోపణలు చేశారు. వీరందరూ కుట్రకు పాల్పడి సుశాంత్ నటించిన సినిమాల విడుదలను అడ్డుకున్నారని, వీళ్ల కారణంగా సుశాంత్ ను ఎవరూ సినీ ఫంక్షన్లకు పిలవని పరిస్థితి ఏర్పడిందని వివరించారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బీహార్ ప్రజలనే కాకుండా, యావత్ భారతీయులను బాధించిందని తెలిపారు. ఈ కేసులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ను ఓ సాక్షిగా నమోదు చేశామని న్యాయవాది సుధీర్ కుమార్ వెల్లడించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను కావాలనే ఎదగనివ్వకుండా చేశారని, అతడికి రావాల్సిన అవకాశాలను చెడగొట్టారని కంగన ఆరోపించడం తెలిసిందే.
Laywer
Sushant Singh Rajput
Salman Khan
Karan Johar
Criminal Complaint
Patna
Bihar
Bollywood

More Telugu News