Intelligence Agencies: జూమ్, టిక్ టాక్ సహా 52 చైనా యాప్ లు ప్రమాదకరమైనవని తేల్చిన భారత నిఘా సంస్థలు
- చైనా యాప్ లపై అనుమాన మేఘాలు
- చైనా యాప్ లను బ్లాక్ చేయాలని నిఘా సంస్థల సిఫారసు
- మద్దతు తెలిపిన జాతీయ భద్రతా సమితి సచివాలయం
గత కొంతకాలంగా చైనా యాప్ లపై అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 52 చైనా యాప్ లు ప్రమాదకరం అని భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి. వాటిలో ఎంతో ప్రజాదరణ పొందిన జూమ్, టిక్ టాక్ వంటి యాప్ లు కూడా ఉన్నాయి. ఈ 52 చైనా మొబైల్ యాప్ లను బ్లాక్ చేయాలని భారత నిఘా సంస్థలు సిఫారసు చేస్తున్నాయి.
యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, క్లీన్ మాస్టర్ తదితర యాప్ లతో భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని తెలిపాయి. ఇవే కాకుండా వుయ్ చాట్, హెలో యాప్, లైక్, సీఎం బ్రౌజర్, ఫొటో వండర్, వైరస్ క్లీనర్, ఎంఐ కమ్యూనిటీ, ఎంఐ స్టోర్, 360 సెక్యూరిటీ, ఈఎస్ ఫైల్ ఎక్స్ ప్లోర్ వంటి యాప్ లు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సిఫారసులకు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ మద్దతు తెలిపింది.