India: అసంపూర్ణంగా ముగిసిన ఇండియా, చైనా సైన్యాధికారుల చర్చలు!
- ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు
- ఏకాభిప్రాయం లేకుండా ముగిసిన మీటింగ్
- మరిన్ని చర్చలు జరిపేందుకు అంగీకారం
సరిహద్దుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న వేళ, భారత్, చైనా ఆర్మీ జనరల్ స్థాయిలోని ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చలు, ఏ విధమైన ఏకాభిప్రాయానికి రాకుండానే ముగిసినట్టు తెలుస్తోంది. "ఈ చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. తక్షణం ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. వెంటనే బలగాలను వెనక్కు పంపాలని కూడా నిర్ణయానికి రాలేదు. సమీప భవిష్యత్తులో మరోసారి చర్చలు జరపాలని మాత్రం నిర్ణయించారు" అని సైనిక వర్గాలు వెల్లడించాయి.
కాగా, గాల్వాన్ నది ప్రాంతంలో రహదారి నిర్మాణం విషయంలో ఇరు దేశాల మధ్యా గొడవ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరువైపుల నుంచి వందలాది మంది సైనికులు పరస్పరం రాళ్లు రువ్వుకుని, బాహాబాహీకి దిగగా, ప్రాణనష్టం సంభవించింది. చైనా, భారత్ ల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలపై ఈ ఘటన ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.