king koti: కోఠి ఆసుపత్రి నుంచి కరోనా రోగి పరార్.. తొర్రూరులో పట్టేసిన పోలీసులు
- రెండు బస్సుల్లో ప్రయాణించి తొర్రూరుకు చేరుకున్న రోగి
- బాధితుడి సోదరుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు, వైద్యాధికారులు
- వరంగల్ ఎంజీఎంకు తరలింపు
కరోనా బారినపడి హైదరాబాద్లోని కోఠి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ రూరల్ జిల్లా రాయపత్రి మండలం కొండాపూర్ వాసి (48) ఆసుపత్రి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తున్న ఆయన కరోనా చికిత్స కోసం ఈ నెల 15న కింగ్ కోఠి ఆసుపత్రిలో చేరాడు. అయితే, నిన్న తెల్లవారుజామున ఆసుపత్రి నుంచి తప్పించుకుని ఎల్బీనగర్ నుంచి ఆర్టీసీ బస్సులో సూర్యాపేటకు చేరుకున్నాడు. అక్కడి నుంచి బస్సులో తొర్రూరుకు వెళ్లాడు. అంతకుముందు అతడు తాను హైదరాబాద్ నుంచి ఇంటికి బయలుదేరినట్టు తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన వైద్యులు, పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వెంటనే డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం, ఎస్సై నగేశ్, ఇతర సిబ్బంది తొర్రూరు బస్టాండుకు చేరుకుని బాధితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ అతడికి పీపీఈ కిట్ తొడిగిన అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం, అతడు ఏ బస్సులో ఎక్కాడు? అందులో ఎందరు ప్రయాణించారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.