India: ఉద్రిక్తతలపై నేడు మరోసారి భారత్-చైనా సైనికాధికారుల చర్చలు
- తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద చర్చలు
- నిన్న అసంపూర్తిగా ముగిసిన చర్చలు
- సైనికులు ఘర్షణకు దిగిన ప్రాంతంలోనే భేటీ
- గాల్వన్ లోయ నుంచి తిరిగి వెళ్లేందుకు అంగీకరించని చైనా
తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా-భారత్ సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణ కలకలం రేపిన నేపథ్యంలో చర్చలతో సమస్య పరిష్కారానికి నిన్న జరిగిన ఉన్నత స్థాయి ఆర్మీ అధికారుల భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల మేజర్ జనరల్ స్థాయి సైనికాధికారులు మరోసారి చర్చలు జరపనున్నారు.
సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగిన ప్రాంతంలోనే ఈ రోజు చర్చలు జరగనున్నాయి. గాల్వన్ లోయ నుంచి తిరిగి వెళ్లేందుకు చైనా అంగీకరించట్లేదని తెలుస్తోంది. 1962లో భారత్-చైనా యుద్ధం జరిగినప్పటి నుంచి గాల్వన్‌లోయ వద్ద అంతగా గస్తీ చర్యలు చేపట్టలేదు.
అయితే, ఇప్పుడు గాల్వన్‌లోయ మొత్తం తమదేనని వాదిస్తోంది. దీంతో ఘర్షణలు కొనసాగుతున్నాయి. చైనా సైనికులు పక్కా వ్యూహం ప్రకారం పాల్పడిన చర్యలతోనే గాల్వన్‌లోయలో సోమవారం ఘర్షణలు చెలరేగాయని ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన చేశారు.
అలాగే, నిన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోనులో చర్చించారు. కాగా, ఇప్పటికే గాల్వన్‌లోయ విషయంపై ఇరు దేశాల అగ్రశ్రేణి కమాండర్లు చర్చలు జరపగా, ఇందులో తీసుకున్న నిర్ణయాలను చైనా ఆర్మీ ఉల్లంఘించిన విషయం తెలిసిందే.