Vellampalli Srinivasa Rao: ఫొటోలు తీయొద్దని ఎవరు చెప్పినా లోకేశ్ వినలేదు: ఏపీ మంత్రి వెల్లంపల్లి

Minister Vellampalli fires on Lokesh and TDP leaders

  • లోకేశ్ నిబంధనలు ఉల్లంఘించాడన్న మంత్రి
  • బీద రవిచంద్రయాదవ్, దీపక్ రెడ్డి దాడి చేశారని వెల్లడి
  • ప్రజల కోసం ఎన్ని దాడులైనా భరిస్తామన్న వెల్లంపల్లి

ఏపీ శాసనమండలిలో నిన్నటి సమావేశాలు ఉద్రిక్తతల నడుమ సాగాయి. టీడీపీ సభ్యులు తమపై దాడి చేశారంటూ వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాకు వివరాలు తెలిపారు. టీడీపీ సభ్యుడు నారా లోకేశ్ సభలో నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీశాడని, ఎవరు చెప్పినా వినిపించుకోలేదని తెలిపారు. శాసనమండలి చైర్మన్ కూడా చెప్పారని, అయినప్పటికీ లోకేశ్ ఫొటోలు తీశారని వెల్లడించారు. దాంతో తాను జోక్యం చేసుకుని ఫొటోలు తీయొద్దంటూ లోకేశ్ కు చెప్పానని వివరించారు.

అయితే, టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర యాదవ్, దీపక్ రెడ్డి తనపై దాడి చేశారని, అందుకు లోకేశ్ ప్రోత్సాహం ఉందని వెల్లంపల్లి తెలిపారు. తనపైనే కాకుండా ఇతర మంత్రులు గౌతమ్ రెడ్డి, కన్నబాబులపైనా దాడి జరిగిందని వివరించారు. లోకేశ్ తీరు చూస్తుంటే సిగ్గేస్తోందని అన్నారు.

అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు చర్చించని టీడీపీ, మండలిలో మాత్రం బిల్లులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బిల్లులను కొన్నాళ్లు ఆపినంతమాత్రాన వచ్చేది శునకానందం తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు. తాము ప్రజల కోసమే పనిచేస్తున్నామని, అందుకే ఇలాంటి దాడులను భరిస్తున్నామని వెల్లంపల్లి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News